సెన్సార్‌పై కేసు వేసి మూడేళ్లు పోరాడిన ఎన్టీఆర్.. తన సినిమాతో చరిత్ర సృష్టించారు!
on Mar 12, 2025
భక్తి ప్రధాన చిత్రంతోనే తొలి తెలుగు సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా తెలుగులో భక్తి ప్రధానంగా ఉన్న సినిమాలనే నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు రాజ్యమేలాయి. సాంఘిక చిత్రాల ఒరవడి మొదలైన తర్వాత భక్తి చిత్రాల నిర్మాణం తగ్గు ముఖం పట్టింది. రకరకాల జోనర్స్‌లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ భక్తి చిత్రాలకు మాత్రం ఆదరణ బాగానే ఉండేది. భక్తి ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా దర్శకులు ఉండేవారు. వారు మాత్రమే భక్తి రసాన్ని బాగా పండించగలరని నిర్మాతలు నమ్మేవారు. ఆ తరహా సినిమాలు రూపొందించడంలోనూ నటరత్న ఎన్.టి.రామారావు తన ప్రత్యేకతను చాటుకున్నారు. మన పురాణాల్లోని పురుషులను అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, శివుడు.. ఇలా ఎవరినైనా తన రూపంలోనే చూపించేవారు ఎన్టీఆర్.
దానవీరశూర కర్ణ వంటి ఘనవిజయం తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని అనుకున్నారు ఎన్టీఆర్. అంతకుముందే ఈ కథతో సినిమా తెరకెక్కించాలని కొందరు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో మధ్యలోనే ఆ సినిమాలు ఆగిపోయాయి. 1953లో స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్‌తో బ్రహ్మంగారి కథని తెరకెక్కించాలనుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చేసేందుకు తన అంగీకారాన్ని తెలియజేశారు. కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌కు బ్రహ్మంగారి గెటప్ వేసి స్టిల్స్ కూడా తీశారు. అయితే కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ సినిమా చెయ్యవద్దని వారించడంతో ఎన్టీఆర్ ఆ సినిమాను వదులుకున్నారు. ఆ తర్వాత హీరో హరనాథ్.. బ్రహ్మగారి కథను కె.వి.నందనరావు దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు. బ్రహ్మంగారిగా హరనాథ్, సిద్ధయ్యగా శ్రీధర్ చెయ్యాలనుకున్నారు. కానీ, అది కూడా సెట్స్‌కి వెళ్లకుండానే ఆగిపోయింది. కరుణామయుడు చిత్రంలో ఏసుక్రీస్తుగా నటించిన విజయ్‌చందర్ కూడా ఈ కథతో సినిమా చెయ్యాలని ప్రయత్నించారు. కానీ, ఆయన కూడా దాన్ని విరమించుకున్నారు. చివరికి ఆ సినిమాను తెరకెక్కించే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నారు.
దానవీరశూర కర్ణ చిత్రానికి మాటలు రాసిన కొండవీటి వెంకటకవితో కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్లారు ఎన్టీఆర్. అక్కడే 14 రోజులు ఉండి బ్రహ్మంగారి చరిత్రను పూర్తిగా తెలుసుకున్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ వర్క్‌ను మొదలుపెట్టారు. గతంలో మాదిరిగానే ఈ సినిమా చెయ్యొద్దని ఆయన శ్రేయోభిలాషులు మరోసారి ఎన్టీఆర్‌కు చెప్పారు. అప్పటివరకు వరస విజయాలు అందుకుంటున్న ఆయనకు కమర్షియల్ అంశాలు లేని ఈ కథ వర్కవుట్ అవ్వదని వారు అభిప్రాయపడ్డారు. కానీ, ఈసారి వారి మాటలు వినకుండా చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళారు ఎన్టీఆర్. 1980లో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు. బ్రహ్మంగారు సంచరించిన అహోబిలం, కందిమల్లయ్యపల్లె, బనగానపల్లె ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మొత్తం 50 వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేశారు. సన్నిహితులు హెచ్చరించినట్టుగానే చిత్ర నిర్మాణ సమయంలోనే నటుడు ముక్కామల, కొందరు టెక్నీషియన్లు, కొందరు జూనియర్ ఆర్టిస్టులు కన్నుమూశారు. అవి సహజ మరణాలే అయినప్పటికీ బ్రహ్మంగారి చరిత్రను సినిమాగా తీస్తున్నారు కాబట్టే అలా జరిగిందని అంతా అనుకున్నారు. అయినా అవేవీ ఎన్టీఆర్ పట్టించుకోలేదు. 1981 నాటికి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రంలో సిద్ధయ్యగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. అలాగే కక్కడు పాత్రకు కైకాల సత్యనారాయణ జీవం పోశారు. ఈ సినిమాలో గౌతమ బుద్ధుడు, వేమన, ఆదిశంకరాచార్య, రామనుజాచార్యులుగా కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు.
సినిమా పూర్తి చేయడం వరకు ఎదురైన ఇబ్బందులు ఒక ఎత్తయితే.. సినిమా రిలీజ్‌కి ముందు వచ్చిన కష్టాలు మరో ఎత్తు. ఈ చిత్రాన్ని సెన్సార్‌కి పంపించగా నలుగురు సభ్యులు కలిగిన ఎగ్జామినింగ్ కమిటీ నాలుగు కట్స్‌ను సూచించింది. అయితే దానికి ఎన్టీఆర్ ఒప్పుకోకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లారు. 10 మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ మరో నాలుగు కట్స్‌ను చేర్చింది. దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సెన్సార్‌పై కేసు వేశారు. సెన్సార్ సభ్యులు కట్స్ విధించిన సీన్స్ ఏమిటంటే.. విధవ రాజ్యమేలును అని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఉంటుంది. ఈ సినిమా సెన్సార్ అయ్యే నాటికి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ కారణంగానే ఆ కట్‌ను విధించారు. ఏమండోయ్ పండితులారా.. ఏమంటారు.. అనే పాటలో బ్రాహ్మణులను కించపరిచారని అభిప్రాయ పడిన కమిటీ ఆ పాటను తొలగించాలని చెప్పింది. తెరపై కదిలే బొమ్మలే అధికారంలోకి వచ్చేను అనే తత్వం చెప్తున్నప్పుడు స్క్రీన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్, అమెరికా ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌లను చూపించడాన్ని కూడా సెన్సార్ అభ్యంతరం తెలిపింది. అలాగే వేమనలో మార్పు వచ్చే సన్నివేశంలో అతని వదినను నగ్నంగా చూపిస్తారు. అది కూడా తొలగించాలని సూచించారు. అయితే సినిమాలోని కీలక సన్నివేశాలైన వాటిని తొలగించేందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదు. అందుకే మూడు సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేశారు. చివరికి ఎన్టీఆర్‌కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. తనకి దూరమైన సతీమణి బసవతారకంకు అంకితమిస్తూ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాన్ని 1984 నవంబర్ 29న విడుదల చేశారు. అప్పటికి ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేయడం, కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా జరిగిపోయింది. ఎన్టీఆర్ విశ్వాసానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. సినిమా ఘనవిజయం సాధించి ఎన్టీఆర్ చేసిన కృషికి మంచి ఫలితాన్ని అందించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
